Tuesday 26 July 2016

Age of Rama during Yajna Samrakshan and at the time of War with Ravana

విశ్వామిత్రుడు శ్రీరాముని యజ్ఞసంరక్షణకు పంపుమని అడుగగా, దశరధుడు పలికిన శ్లోకములో రాముని 16 సం||ల  లోపు వయస్సు కలవాడుగ వర్ణించెను.

 ఊన షొడశవర్షో మే రామో రాజీవలోచనః |
 న యుద్ధ యొగ్యతామస్య పశ్యామి సహరాక్షసైః |

భావము: రాజీవలోచనుడైన నా రాముడు పదునారేండ్ల వయస్సు కూడా నిండని వాడు.కనుక ఇతడు చిఱుతప్రాయమున ఆ క్రూర రాక్షసులతొ యుద్ధము చేయగలడని నేను అనుకొనను.

యజ్ఞసంరక్షణ సమయమున రామలక్ష్మణుల రూపములను వర్ణించు శ్లోకము.

విశ్వామిత్రో యయావగ్రే తతో రామోదనుర్ధరః |
కాకపక్షధరో ధన్వీ తంచ సౌమిత్రి రన్వగాత్ ||

కలపినౌ ధనుష్పాణీ  శోభయనౌ దిశో దవే |
విశ్వామిత్రం మహాత్మానం త్రిశీర్షవివ పన్నగౌ ||

భావము:
విశ్వామిత్రుడు ముందుకు సాగిపొవుచుండగ జులపాలజుట్టుగల శ్రీరాముడు ధనుర్ధారియై అయనను అనుసరించెను. లక్ష్మణుడు ధనువును చేబట్టి రాముని వెంట నడిచెను.

ఆ రామలక్ష్మణులు అమ్ముల పొదులను, ధనస్సులను ధరించి, తమ తమ శోభలతొ అన్ని దిక్కులకు వెలుగులను విరజిమ్ము చుండిరి. అటునిటు తూణీరములను, ధనస్సును దాల్చి వారు మూడు తలల పాము వలె భాసిల్లుచుండిరి.

దీనినిబట్టి యజ్ఞసంరక్షణ సమయమునకు రాములవారు జులపాలజుట్టుగలవాడు, రాజీవలోచనుడు, 16 సం|| లొపు వయస్సు కలవాడూ అని తెలుసుకోవలెను.


ఆశోకవనములో హనుమంతునితో సంభాషించు సమయమున సీతమ్మ తల్లి , తమ పెళ్ళి తర్వత 12 సం||లు అయోధ్య అంతఃపురములో గడిపినట్లుగా  తెలిపినది.

సమా ద్వాదశ తత్రాహం రాఘవశ్య వివేశనే |
భుంజానా మానుషాన్ భోగాన్ సర్వకామసమృద్ధినీ ||

భావము: నేను అయోధ్యలొ శ్రీరాముని అంతఃపురమున ఏ లోటు లేనిదాననై, సమస్త మానవ భోగములను అనుభవించుచు 12సం||లు గడిపితిని.

దీనినిబట్టి వివహసమయానికి శ్రీరాముని వయస్సు 16సం||లు , అరణ్యవాసము  మొదలయ్యెనాటికి 28 సం||లు , అరణ్యవాసం చివరలో యుద్ధం జరిగింది కావున, 28కి 14 కలిపితే 42సం||లు; అంటే శ్రీరాములవారి వయస్సు రావణునితో యుద్ధ సమయనికి సుమారుగ  42సం||లు అని తెలుస్తోంది. 

1 comment:

  1. Very nice interpretation, seems close to accuracy. Congratulations.

    ReplyDelete