Monday, 29 August 2016

గోన బుద్ధారెడ్డిచే రచింపబడిన రంగనాథరామయణములొని "విశ్వామిత్ర యజ్ఞరక్షణము"

నంత రాఘవుండు విశ్వామిత్రుంజూచి
సంతసంబున: "మునీశ్వర!మీరు నేడు
యాగ దీక్ష వహింపుడనుమానముడిగి;
యాగశత్రుల నెల్ల నడచెద నేను."
అనిన హర్షించి విశ్వామిత్రమౌని
మునుల రప్పించి  యిమ్ముల దీక్ష వడసి
యాగవేదులు మునులర్థిం గావింప
యాగాంగములు పూర్ణమై వేది యొప్పె.
నంచితాజ్యాహుతు లందంద దొరుగ
మించి యగ్నులుమండిమింటికిం బ్రాంక;
హోమాగ్నింబ్రభవించు నున్నతధ్వనులు,
సామాదివేద ప్రసంగఘోషములు,
నాతత దేవతాహ్వాన రావములు,
హోతలపుణ్యమంత్రోరునాదములు
దిక్కులెల్లను నిండి తివిఱి ఘోషింప;
నక్కజంబై యాగమటు చెల్లుచుండ
రామచంద్రుండు ధనుర్ధరుండు దానగుచు
సౌమిత్రియును దాను జాగరూకతను
రక్కసుల్ వచ్చుమార్గము మున్నె యెఱింగి
యక్కౌశికుని మౌనియై యున్నవాని
విస్వమంతయుందమోవృతము గాకుండ
శశ్వత్ప్రభలంగాచుచంద్రార్కు లనంగ
గాచిరి కంతికిం గనుఱెప్ప కరణి
నేచినభక్తి నయ్యెడ నైదునాళ్లు
అలుకమైంగవగూడి యా మరునాండు
బలిమి మారీచ సుబాహు లేతెంచి
మేలిఖడ్గద్యుతుల్ మెఱుంగులు గాంగం
గ్రాలు కాలంబుదోత్కరములో యనంగ
బలములుందారు నుద్భటవృత్తి  మింట
నిలిచి గర్జనములు నిగుడిచి మించి
వదలక యయ్యజ్ఞ వాటంబులోన
మదమున నుప్పొంగి మాంసరక్తములు
గురియుచో హోతలకోలాహంబులు
గరిమ సదస్యుల కలకలధ్వనియుం,
బరిచారకుల దీనభాషణధ్వనియుం
బరికించి విని రామ భద్రుండు వొంగి;
"లక్ష్మణ!చూడు నా లా."వంచు విజయ
లక్ష్మీధనుర్ఘోష లక్షణం బెసగ
నెలకొని వినువీధి నిజదృష్తి నిలిపి
బలువిడి వాయవ్యబాణ మేయుతయు
నురువడి మారీచు నువ్వెత్తుగాంగ
సరభసవృత్తిమై శతయోజనములు
గొనిపోయి యఱిముఱింగ్రూరరాక్షసుని
వనధిలోపలం బాణవైచె నాశరము;
అడరి వజ్రమునకు నలికి యంభోధిం
బడిన మైనాకమై పడినయయ్యసుర
యొకరీతి దరించేరి యుగ్రాంశుకులుని
యకలంకవిక్రమం బందంద పొగడి
దనుజులం బాసి యాతత నిష్థతోడ
ననయంబు నాసుచంద్రాశ్రమభూమి
శూరత విడిచి యాసురవృత్తి నడిచి
ఘోర తపంబుంగైకొని సేయుచుండె.
నఱిముఱి రఘురాముండగ్నిబాణమున
నుఱక సుబాహుని నురమేసి చంపెం.
దక్కిన రాక్షస దళముల నొకటం
జక్కాడె మానవశరమహత్వమున.
సురలు మోదించి యచ్చోబుష్పవృష్తిం
గురుసిరి;మునికోతిగొనియాడె నతని.
నతినిష్థ వెలయ విశ్వామిత్రమౌని
గ్రతుకర్మమంతయుం గడతేర్చి వచ్చి
"నెలకొని రఘురామ, నీ ప్రసాదమునం
గలంగక చెల్లింపంగంతి నీ క్రతువు
నతిక్రుతార్థుండైతి." నని కౌంగిలించి
యతని దీవించి సమ్యమియు హర్షించె
మరునండు రామలక్ష్మను లిరువురును
నఱలేని మైత్రి విశ్వామిత్రుంజూచి
"యింక నెయ్యదికార్యమెఱింగింపు;నీకు
గింకరులం;నీదు క్రుపకుంబాత్రులము."
అనిన నచ్చతిమౌనులందఱు గాధి
తనయు మున్నిడికొని తా మిట్టులనిరి.

Saturday, 20 August 2016

రామాయణంలో లక్ష్మణ రేఖ ఉందా ? లేదా?

మారీచుడు "హే లక్ష్మణ.... హే సీత..." అని రాముని అనుకరించుచూ అరిచిన అరుపులు రామునివిగ తలచి వగచుచూ, రాముడు బంగారు లేడి కోసం వెల్లి ఆపదలలో చిక్కుకున్నాడని తలచి, సీతాదేవి లక్ష్మణని పరుష వాక్యములతో నిందించెను.

తతస్తు సీతాం అభివాద్య లక్ష్మణః  కృతాంజలి కించిదభిప్రణమ్యచ ||
అన్వీక్షమాణొ బహిశశ్చ మైథిలీం జగామ రామస్య సమీపమాత్మవాన్ ||

భావము: సీతాదేవి మొండివైఖరికిని, ఆమె పలికిన తీవ్రవచనములకును నొచ్చుకొనిన లక్ష్మణుడు దోసిలియొగ్గినవాడై, ఒక ప్రక్కగ నిలడి ఆమెకు నమస్కరించెను. పిమ్మట "ఈమెను ఇచ్చట ఒంటరిగ విడిచివెల్లుట ఎట్లు ?' అను తడబాటుతో ఆమె వైపు చూచుచు , మనస్సును దిటవు చేసికొని, శ్రీరాముని సమీపమునకు బయలుదెరెను.

తయా పరుషముక్తస్తు కుపితో రాఘవానుజః |
స వికాంక్షన్ భృశం రామం ప్రతస్థే నచిరాదివ ||

భావము: సీతాదేవి పరుషవచనములకు లక్ష్మణుడు మిగుల కలతచెందెను. సీతను ఒంటరిగా విడిచి వెల్లుటకు కాళ్ళాడకున్నను అన్నను త్వరగా చేరుటకై వెంటనే అతడు ఆశ్రమమును విడిచి బయలుదేరెను.

తదాసాద్య దశగ్రీవః క్షిప్రం అంతరమాస్థితః |
అభిచక్రామ వైదీహీం  పరివ్రాజకరూపదృత్ ||

భావము : తగిన అవకాశముకొఱకు ఎదురుచూచున్న దశగ్రీవుడైన రావణుడు, లక్ష్మణస్వామి అటువెల్లుట గమనించి, వెంటనే సన్యాసి వేషములో సీతాదేవి సమక్షమున నిలిచెను .


వరుసగా జరిగిన ఈ వృత్తాంతములో , ఎక్కడ కూడ లక్ష్మణస్వామి రేఖను గీసినట్లుగా వాల్మీకి రామయణములో లేదు.


ఇది ఆ తర్వాత వచ్చిన స్వేచ్చానువాదములలో (రామచరితమానస్, రంగనాధరామయణము ) ఉన్నది. ఉదాహరణకు రంగనాథ రామయణమునుండి స్వీకరింపబడిన ఈ క్రింద పద్యమును చూడండి. పర్ణశాల చుట్టూ 7 గీతలు గీసి అది దాటవద్దని సీతమ్మవారికి చెపుతూ, అది పరులెవరైనా దాటి వచ్చినట్లైతే వారి తల వేయి వ్రక్కలు అవుతుంది అని నిర్ణ్యం చెసి రాముని కలియుటకు లక్ష్మణుడు అడవిలోకి వెళ్ళాడు.తిరుమల తిరుపతి దేవస్థానంవారి publication రంగనాథరామయణములో  లక్ష్మణరేఖకు సంబంధించిన పద్యములేదు. It is missed or they might have not considered.

మరికొన్ని స్వేచ్చానువాద రామయణ గ్రంధములను పరిశీలించవలసియున్నది.