Friday, 2 September 2016

హనుమంతుడు శ్రీరాముని శరీర చిహ్నములను,గుణములను వివరించుట

ఇంతకుముందు మనము శ్రీరాముడు 16సం||ల వయసులో ఎలా ఉన్నాడో తెలుసుకున్నాము.  ఇప్పుడు హనుమంతుడు , సీతమ్మవారిని వెదుకుచూ ఆశోకవనములో అమ్మవారిని దర్శించి సీతమ్మ తల్లి కోరికపై హనుమంతుడు శ్రీరాముని శరీర చిహ్నములను,గుణములను వివరించి, నరవానరుల మైత్రి విషయమును దెలిపి, ఆమెకు విశ్వాసమును కలిగించారు .అంటే ఇంతకుముందు వివరించినట్లుగా ఈ వర్ణన కాలానికి శ్రీరాముని వయస్సు సుమారుగ 41సం||లు. ఈ సందర్భములో హస్తసాముద్రికము  మరియు ముఖ లక్షణములను ఎంత చక్కగా వర్ణించారో నవవ్యాకరణ  పండితుడు హనుమంతులవారు !

[     జై శ్రీరామ !   ]

తాం తు రామకథాం శ్రుత్వా వైదేహీ వానరర్షభాత్|
వువాచ వచనం సాంత్వం ఇదం మధురయా గిరా|

సీతాదేవి వానరశ్రేష్ఠుడైన హనుమంతుని ద్వారా శ్రీరామగాధనువిని,ఆతనిపైకనికరముచూపుచు మధుర వచనములను ఇట్లు పలికెను.

క్వ తే రామేణ సంసర్గః కథం జానాసి లక్ష్మణం |
వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః|

నీకు శ్రీరామునితో పరిచయము ఎట్లు ఏర్పడినది?లక్ష్మణుని ఏ విధముగా ఎఱుగుదువు? నరవానరుల సమాగమము జరిగినతీరేమి?

యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానర|
తాని భూయస్సమాచక్ష్వ న మాం శోకస్సమావిశేత్|

ఓ వానరోత్తమా!రామలక్ష్మణులచిహ్నములు ఎట్టివి?వాటిని పూర్తిగా వివరింపుము.వాటిని వినుట వలన నా శోకము తొలగును.

కీ దృశం తస్య సంస్థానం రూపం రామస్య కీదృశం|
కథమూరూ కథం బాహూ లక్ష్మణస్య చ శంస మే|

రామలక్ష్మణుల అవయవములపొందిక ఎట్టిది?వారి ఆకారములు ఎట్టివి; ఊరువులు,బాహువులు ఎట్టివి?నాకు వివరింపుము.

ఏవముక్తస్తు వైదేహ్యా హనుమాన్ మారుతాత్మజః|
తతోరామమ్యథాతత్వం ఆఖ్యాతుముపచక్రమే|

సీతాదేవి ఇట్లడుగగా వాయుసుతుడైన హనుమంతుడు శ్రీరాముని రూపరేఖాలావణ్యములను యథాతథముగా వివరించుటకు ఉపక్రమించెను.

జానంతీ బత దిష్ట్వా మాం వదేహి పరిపృచ్ఛసి|    
భర్తుః కమల పత్రాక్షి సంస్థానం లక్ష్మణస్య చ|  

కమలపత్రములవంటి కన్నులుగల ఓ సీతాదేవి!నీ భర్తయైన రాముని యొక్క,మఱదియైన లక్ష్మణునియొక్క అవయవ సౌభాగ్యములను నీవు ఎఱుగుదువు. ఐనను నీవు నన్ను అడుగుట నా అదృష్టము,చాలా సంతోషము.

యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై|
లక్షితాని విశాలాక్షి వదతశ్శృణు తాని మే|

ఓ విశాలాక్షీ!శ్రీరాముని చిహ్నములను,లక్ష్మణుని లక్షణములను నాకు తెలిసినంతవఱకు వివరించెదను వినుము.

రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః|
రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే|

ఓ జానకీ|శ్రీరాముడు కమలపత్రములవంటి కన్నులు గలవాడు,తన నిరుపమాన కాంతిచే సమస్త ప్రాణులకును ఆనందమును గూర్చువాడు,పుట్టుకతోనే అతడు చక్కని దేహ సౌందర్యము,గుణసంపదయు గలవాడు.

తేజసాదిత్యసంకాశః క్షమయా పృథివీసమః|
బృహస్పతిసమో బుద్ధ్యా యశసా వాసవోపమః|

అతడు తేజస్సున సూర్యునివంటివాడు,సహనమునందు భూదేవితోతుల్యుడు,బుద్ధి యందు బృహస్పతి,యశస్సు  చే దేవేంద్రుడు.రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితాః|
రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః|

సర్వ ప్రాణులకును సంరక్షకుడు,విశేషముగా తనను ఆశ్రయించిన(శరణుజొచ్చిన) వారిని పరిరక్షించు వాడు,లోకమునకు ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయమున జాగృతిగలవాడు,ధర్మ రక్షకుడు,శతృవులను రూపు మాపువాడు.

రామో భామిని లోకస్య చాతుర్వర్ణ్యస్య రక్షితా|
మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సః|

ఓ సీతాదేవి! అతడు నాలుగువర్ణముల వారినీ రక్షించువాడు,లోకమర్యాదలను తాను పాటించుచు ఇతరులచే పాటింపజేయువాడు.

అర్చిష్మానర్చితోత్యర్థం బ్రహ్మచర్యవ్రతే స్థితః|
సాధూనాముపకారజ్ఞః ప్రచారజ్ఞశ్చ కర్మణాం|

కాంతిమంతుడు,సర్వలోకములకును అత్యంత పూజ్యుడు,బ్రహ్మ చర్య వ్రతమును పాటించువాడు,సత్పురుషులొనర్చు ఉపకారములనుమఱవని వ్యవహార జ్ఞాన సంపన్నుడు,లోక కల్యాణమునకై కర్మలను ఆచరించువాడు.ఇతరులచే ఆచరింపజేయువాదు.

రాజవిద్యావినీతశ్చ బ్రాహ్మణానాముపాసితా|
శృతవాన్ శీలసంపన్నో వినీతశ్చ పరంతపః|


రాజవిద్యాకుశలుడు,బ్రాహ్మణులనుఆదరించువాదు,సర్వవిద్యాపారంగతుడు,సదాచారసంపన్నుడు,వినయశోభితుడు,శతృభయంకరుడు.

యజుర్వేదవినీతశ్చ వేదవిద్భిస్సు పూజితః|
ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠితః|

రాముడు యజుర్వేదమునందు పారంగతుడు,ధనుర్వేదము నందును,ఋక్సామాధర్వవేదముల యందును,శిక్షాది వేదాంగములయందును నిష్ణాతుడు,వేదపండితులచే పూజింపబడుచుండువాడు.

విపులాంసో మహాబాహుః కంబుగ్రీవః శుభాననః|
గూఢజత్రుస్సుతామ్రాక్షో రామో దేవి జనైః శ్రుతః|

ఓ సీతాదేవీ!రాముడు విశాలమైనభుజములు,దీర్ఘములైన బాహువులు,శంఖము వంటి కంఠముగలవాడు,శుభప్రదమీన ముఖముగలవాడు,కండరములతో మూసుకొనిపోయిన
సంధియెముకలుగలవాడు,మనోహరములైన ఎర్రని కన్నులుగలవాడు,లోకవిఖ్యాతుడు.

దుందుభిస్వననిర్ఘోషః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్|
సమస్సమవిభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రితః|  

అతడు దుందుబిధ్వని వలె గంభీరమైనకంఠస్వరము,గలవాడు,నిగ నిగ లాడు శరీర ఛాయ  గలవాడు,ప్రతాపశాలి,ఎక్కువతక్కువలులేకుండ పరిపుష్టములైన చక్కని అవయవములుగలవాడు,మేఘశ్యామవర్ణ శోభితుడు.

త్రిస్థిరస్త్రిప్రలంబశ్చ త్రిసమస్త్రిషు చోన్నతః|
త్రితామ్రస్త్రిషు చ స్నిగ్ధో గంభీరస్త్రిషు నిత్యశః|

వక్షః స్థలము,మణికట్టు,పిడికిలి-ఈ మూడు స్థానములను దృఢముగా గలవాడు.(ఇవి రాజలక్షణములు),దీర్ఘములైన కనుబొమలు,బాహువులు,ముష్కములు గలవాడు(ఇవి సంపన్నుల లక్షణములు) తలవెంట్రుకలు,ముష్కములు,మోకాళ్లు-ఈ మూడును సమప్రమాణమున గలవాడు.(ఇవి రాజలక్షణములు) ఉన్నతమైన నాభి,పొట్ట(కుక్షి),వక్షఃస్థలము గలవాడు,(ఇవియు రాజలక్షణములు) ఎఱ్ఱని నేత్రాంతములు,నఖములు,అఱచేతులు,అఱికాళ్లు గలవాడు,(ఇవి సుఖ పురుషుని లక్షణములు) నునుపైన పాదరేఖలు,కేశములు గలవాడు. (ఇవి భాగ్యవంతుని లక్షణములు) ఆయన కంఠస్వరము, నడక, నాభి గంభీరములైనవి. (ఇవి ప్రశంసాపాత్రుని లక్షణములు)

త్రివలీంవాంస్త్య్రయవనతః చతుర్వ్యంగస్త్రిశీర్షవాన్|
చతుష్కలశ్చతుర్లేఖః చతుష్కిష్కుశ్చతుస్సమః|

శ్రీరాముని ఉదరముపై లేక కంఠమునందు త్రిరేఖలు గలవు.(మూడు ముడతలుగలవాడు) స్తనములు,స్తనాగ్రములు,పాద రేఖలు నిమ్నముగా నుండును.ఆయన కంఠము,లింగము,వీపు,పిక్కలు హ్రస్వములుగా నుండును.(ఇవి పూజ్యుని లక్షణములు) శిరస్సుపై మూడుసుడులు గలవాడు, (ఇవి మహారాజలక్షణములు) నాలుగు వేదములను సూచించు రేఖలుగలవాడు,అనగా బొటనవ్రేలి మొదటను,నొసటి పైనను,అఱచేతులలోను,అఱికాళ్లలోను నాలుగేసి రేఖలుగలవు.(ఇవి వేద పారంగతుని లక్షణములు) లలాట,పాద,పాణి తలములయందు నాలుగురేఖలు, గలవాడు.(ఇవి ఆయుర్ధాయమును,మహారాజలక్షణములను సూచించును) అతడు తొంబదియాఱు అంగుళముల (4 మూరల) ఎత్తైనవాడు.దేవతాసమానుడు.(ఇవి దివ్య పురుషుని లక్షణములు).ఆయన బాహువులు, మోకాళ్లు, ఊరువులు, పిక్కలు అనునని (నాల్గును) హెచ్చ్హుతగ్గులలేకుండా సమానముగా నుండువాడు.

చతుర్దశసమద్వంద్వః చతుర్దమ్ష్ట్రశ్చతుర్గతిః|
మహోష్టహనుమానశ్చ పంచస్నిగ్ధో ష్టవంశవాన్|

పదునాలుగుజతలు అనగా కనుబొమ్మలు,నాసికాపుటములు,నేత్రములు,చెవులు,పెదవులు,స్తనాగ్రములు,మోచేతులు,మణికట్టులు,మోకాళ్లు,ముష్కములు,పిఱుదులు,చేతులు,పాదములు,పిఱుదులపై ఎత్తైన కండరములు సమప్రమాణములోగలవాడు.(ఇవి రాజలక్షణములు) అతడు నాలుగుదంష్ట్రలు,సూది వలె మొనదేలిన దంతములు) కలవాడు(రెండు పలు వరసలలో మధ్యగల నాలుగుదంతములకును ప్రక్కన ఉన్న నాలుగుపండ్లకును 'దంష్ట్రలూ అను పేరు ప్రసిద్ధము) నాలుగు మృగముల (సింహము,పెద్దపులి,ఏనుగు,వృషభము) నడక వంటి నడక గలవాడు.
అందమైన పెదవులు,చుబుకము,నాసికగలవాడు. (ఇవి రాజలక్షణములు) ఓదేవీ!ఆ రాముడు నిగనిగలాడు నేత్రములు,పలు వరస,చర్మము,పాదములు,కేశములు గలవాడు.(ఇవి సుఖ పురుష లక్షణములు) జానకీ! ఆయన శరీరము,చేతి వ్రేళ్లు,కాలి వ్రేళ్లు,కరములు,నాసిక,నయనములు,కర్ణములు,ప్రజనము అను అష్ట వంశములు తగిన ప్రమాణములో గలవాడు.

దశపద్మో దశబృహత్ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్|
షడున్నతో నవతనుః త్రిభిర్వ్యాప్నోతి రాఘవః|

శ్రీరాముడు పద్మములవంటి ముఖము, నేత్రములు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్లు, హతములు, పాదములు గలవాడు. అతడు శ్రేష్టమైన శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయము, నోరు, చేతులు, కాళ్లు,వీపు అను పది అవయవములు గలవాడు.ఆ శ్రీరాముని తేజస్సు, యశస్సు, సంపదలు సర్వలోక ప్రసిద్ధములు.పవిత్రములైన మాతృ,పితృ వంశములు గలవాడు.మఱియు స్వచ్చములైన నేత్రములు దంతములు, గలవాడు. చంకలు, ఉదరము, వక్షఃస్థలము, నాసిక,భుజములు, లలాటము ఉత్తములైన ఆఱు అంగములు గలవాడు.సూక్ష్మములైన వ్రేళ్లకణుపులు, వెంట్రుకలు, రోమములు, గోళ్లు చర్మము, మీసము, దృష్టి, బుద్ధి-గలవాడు.పూర్వాహ్ణము,మధ్యాహ్నము,అపరాహ్ణము అను త్రికాలముల యందును ధర్మార్ధకామములను ఆచరించుచుండువాడు.            

సత్యధర్మపరశ్శ్రీమాన్ సంగ్రహానుగ్రహే రతః|
దేశాకాలవిభాగజ్ఞః సర్వలోక ప్రియంవదః|

ఆ శ్రీరాముడు సకలైశ్వర్యసంపన్నుడు, సత్యభాషణము నందును,ధర్మాచరణమునందును నిరతుడు, ధర్మమార్గమున ధనమునార్జించి, పాత్రులకు దానము చేయువాడు,దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు,అందఱితోడను ప్రియముగా మాట్లాడెడివాడు.

భ్రాతా చ తస్య ద్వైమాత్రః సౌమిత్రిరపరాజితః|
అనురాగేణ రూపేణ గుణైశ్చైవ తథావిధః|

స సుపర్ణఃచ్ఛవిః శ్రీమాన్ రామశ్శ్యామో మహాశాయాః|
తావుభౌ నరశార్దూలౌ త్వద్దర్శనసముత్సుకౌ|

శ్రీరాముని సోదరుడైన లక్ష్మణుడు,ఇద్దఱు తల్లుల(కౌసల్యాసుమిత్రల) ముద్దుల కొడుకు.అతడు అనురాగముచేతను,రూపగుణములచేతను పూర్తిగా రామునివంటివాడే.అతడు సాటిలేని వీరుడు,వాసికెక్కిన శ్రీరాముడు మేఘశ్యాముడు,లక్ష్మణుడేమో బంగారు వన్నెవాడు. ఆ పురుషశ్రేష్ఠులిద్దఱును నిన్ను చూడవలెనని కుతూహలపడుచున్నారు.